ప్రకాశం జిల్లా, మార్కాపురంలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో రూ.46లక్షల విలువైన సొత్తును దొంగలు దోచుకెళ్లారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్ళితే..... మార్కాపురం పట్టణంలోని మెయిన్ బజార్‌లో కందెపు గురువర్ధన్ వస్త్ర దుకాణం నడుపుతున్నాడు. ఆషాపు లోపల వెనక వైపు ఆయన ఇల్లు ఉంది. గురువర్ధన్ ఓ వివాహ నిమిత్తం శనివారం కడప జిల్లా ప్రొద్దుటూరు వెళ్లారు. ఆయన భార్య మేడ పై నిద్రించింది. ఈ క్రమంలో దొంగలు ఇంటి వెనుక తలుపు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాను చాకచక్యంగా తెరిచారు. అందులో ఉన్న మూడు బంగారు బిస్కెట్లు, ఆభరణాలతో కలిపి 80 తులాల బంగారం, రూ.70 వేల నగదును అపహరించుకెళ్లారు. చోరీ జరిగిన విషయాన్ని ఆదివారం ఉదయం గుర్తించారు. పక్కనే ఉన్న ఫ్యాన్సీ స్టోర్‌లో కూడా దొంగలు రూ.10 వేలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న డీఎస్పీ కిషోర్‌కుమార్, సీఐ భీమానాయక్, పట్టణ ఎస్‌ఐ శశికుమార్‌లు చోరీ జరిగిన గృహాన్ని పరిశీలించారు. ఒంగోలు నుంచి వచ్చిన క్లూస్ టీం ఆధారాలు సేకరించింది.