రాజుతల్చుకొంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా ఉన్నాడో తల్చుకొంటే గ్రాండ్ పెళ్లికి ఏ కొదవ అని చెప్పవచ్చు. భారతీయ సంప్రదాయంలో పెళ్లికి అధిక ప్రాధాన్యం ఉంది. హంగు, ఆర్భాటాలు సర్వసాధారణం. జీవితంలో ఒక్కసారే జరిగే సంబరం కావడంతో ఖర్చుకు ఎక్కడా వెనుకాడరు. ఆహ్వాన పత్రిక దగ్గర నుంచి.. మండపం డెకరేషన్, భోజనం, పట్టుచీరలు, నగలు ఒకటా రెండా అన్ని తమ తాహతకు మించి ఖర్చుచేస్తారు. ప్రస్తుతం కాలంలో ఇది మరింత పెరిగింది. పెళ్లిళ్లు కలకాలం గుర్తుండిపోయేలే జరుపుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా వినూత్నంగా ఊరేగింపులు, వేడుకలు జరుపుకుంటున్నారు. గుజరాత్‌కు చెందిన ఓ వరుడు పెళ్లి వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏనుగు అంబారీ ఎక్కిన వరుడు.. కరెన్సీ నోట్లు వెదజల్లుతూ కత్తిపట్టుకుని చిందులేశాడు. ఓవైపు లగ్జరీ కార్లు కూడా ఈ ఊరేగింపులో మరో ఆకర్షణగా నిలిచాయి. వివరాల్లోకి వెళ్తే భావ్‌నగర్ జిల్లాకు చెందిన రమేశ్ భగవాన్భాయ్ హౌలియా కుమారుడు కుల్దీప్కు.. గర్దా ప్రాంతానికి చెందిన వైశాలి అనే యువతితో వివాహం జరిగింది. ఫిబ్రవరి 23న జరిగిన ఈ పెళ్లి గురించి చుట్టుపక్కల ప్రాంతాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వివాహానికి ముందు వధువు ఇంటికి ఊరేగింపుగా వెళ్లిన కుల్దీప్ ఏనుగు అంబారీ ఎక్కాడు.
దానిపై నుంచి కత్తిపట్టుకుని విన్యాసాలు చేశాడు. దీన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా అక్కడకు చేరుకున్నారు. అక్కడ ఎవరైనా రాజుకు పెళ్లి జరుగుతుందా? అని ఆశ్చర్యపోయారు. ఈ సమయంలో వరుడు కుల్దీప్ ఉత్సాహంతో ఏనుగుపై నుంచి నోట్ల కట్టలను వెదజల్లాడు. ఈ ఊరేగింపులో ఖరీదైన లగ్జరీ కార్లు ఏనుగును అనుసరించాయి. ఈ కార్లపైకి ఎక్కి అతడి బంధువులు కూడా నోట్ల కట్టలను కిందకు విసిరారు. వాటిని అందుకోడానికి స్థానికులు ఎగబడ్డారు. సెల్ఫీలు కూడా దిగేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు.
దీంతో దాదాపు ఓ కిలోమీటరు మేర ట్రాఫిక్ స్తంభించింది. రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నామని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో స్థానికంగా వైరల్‌గా మారింది. వధువు కోట్లాది రూపాయాలు ఖరీదైన కార్లతో ఊరేగింపుగా వచ్చినా.. వరుడు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఎద్దుల బండిపై కళ్యాణవేదిక వద్దకు చేరుకున్న ఘటన కూడా గుజరాత్‌లోనే జరిగింది. బీజేపీ నేత తన కుమారుడి వివాహాన్ని ఆధునిక, సంప్రదాయల మేలవింపుతో జరిపించి ప్రత్యేకత చాటుకున్నారు.