రాబోయే కాలంలో కమ్యూనికేషన్ ఆధారంగా ప్రతి తరగతి గదిలో స్మార్ట్ టీవీని అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంపై దృష్టి సారించిందని ఆయన అన్నారు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌ను సోమవారం మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఇలాంటి ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థుల ప్రతిభను గుర్తించాలని ఉపాధ్యాయులను కోరారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల కోసం చేసే ఆలోచనను అందరూ గుర్తించాలని బొత్స సత్యనారాయణ అన్నారు. రాబోయే కాలంలో కమ్యూనికేషన్ ఆధారంగా ప్రతి తరగతి గదిలో స్మార్ట్ టీవీని అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఇలాంటి అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోరుముద్ద, విద్యా దీవెన, విద్యాకానుక వంటి పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విద్యార్థుల యూనిఫామ్‌లో త్వరలోనే మార్పులు వస్తాయని తెలిపారు. విద్యార్థులు హుందాగా ఉండేలా యూనిఫామ్ రూపొందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీలో కంటే ఎక్కువగా విద్యా రంగంలో సౌకర్యాలు అందిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిషేధిస్తున్నామని.. దీనిపై పాఠశాల నుంచే అవగాహన కల్పిస్తున్నామని మంత్రి బొత్స పేర్కొన్నారు. ర్యాగింగ్ చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. విద్యార్థులకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అధ్యాపకులకు చెప్పాలని బొత్స సూచించారు. పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు ర్యాగింగ్‌పై అవగాహన కల్పించాలని సూచించారు.