తలదన్నేవాడు ఒక్కడుంటే వాడి తలదన్నేవాడు ఇంకోడు ఉంటాడు అన్నట్లుంది తాజా ఘటన. ఏలూరు జిల్లాలో బ్యాంకునే బురిడీ కొట్టించిన ఘటన ఆలస్యంగా బయటపడింది. జంగారెడ్డిగూడెంలోని ఓ బ్యాంకులో గిల్టు నగలు తాకట్టు పెట్టి రుణాలు నొక్కేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బ్యాంకు సౌత్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు.. ఈ క్రమంలో ఓ అధికారి టీమ్ ఈ మోసాన్ని గుర్తించినట్లు చెబుతున్నారు. బ్యాంక్ సిబ్బందితో కలిసి ఎవరైనా గిల్టు నగలుతో బ్యాంకు సొమ్ములు కాజేశారా.. అకౌంట్స్ ఉన్నవారు కుదువ పెట్టి రుణాలు తీసుకున్నాక ఆభరణాలు మార్చారా అన్నది తేలాల్సి ఉంది.
అక్కడితో ఆగకుండా మూడేళ్లుగా అవే ఆభరణాలతో బ్యాంకులో రుణాలను రెన్యువల్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా మూడేళ్ల వ్యవధి దాటిన లోన్లు బ్యాంకులో 250 వరకు ఉన్నాయి అంటున్నారు. వీటిలో కొన్నింటికి గిల్టు నగలతో లోను తీసుకున్నారని తేలింది. భారీగా రుణాలు దారి మళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. మరికొంత బంగారాన్ని తనిఖీ చేయాల్సి ఉందని చెబుతున్నారు. రుణాలు తీసుకున్న ఓ వ్యక్తి స్పందించకపోవడంతో అనుమానం జరిగింది.
బ్యాంకులో జరిగిన గోల్ మాల్ వాస్తవమే అంటున్నార మేనేజర్. ఎంత మేర గోల్ మాల్ జరిగింది అనే దానిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. ఇటు పోలీసులకు ఇంకా ఫిర్యాదు చేయలేదు. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ ఇస్తామంటున్నారు బ్యాంక్ అధికారులు.