ప్రతిష్టాత్మకమైన సదస్సుల కోసం విశాఖ నగరం ముస్తాబైంది. మార్చి 3, 4 తేదీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జరగనుంది. ఇందుకోసం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మరొకటి జీ-20 సదస్సు. మార్చి 28, 29 తేదీల్లో రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో జరగనున్నది. రెండింటికీ దేశ, విదేశాల నుంచి అతిథులు హాజరు కానుండడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాబోయే రాజధాని విశాఖపట్నమేనని ఇప్పటికే ఢిల్లీలో ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన నేపథ్యంలో సుమారు రూ. 120 కోట్ల వ్యయంతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన మార్గాలకు మరమ్మతులు చేసి, డివైడర్లకు రంగులు వేస్తున్నారు.
బీచ్ రోడ్డుకు కొత్త సొబగులు అద్దుతున్నారు. కొత్తగా సాగర్‌నగర్‌లో మరో బీచ్‌ను పర్యాటకులు సందర్శించే విధంగా తయారు చేశారు. ఫుట్‌పాత్‌లన్నింటికీ రంగులు వేస్తున్నారు. కైలాసగిరిని, వీఎంఆర్‌డీఏ పార్కు, తొట్లకొండ తదితర ప్రాంతాలకు అతిథులు వెళ్లనున్నందున. ఆయా ప్రాంతాల్లో కొత్త హంగులు సమకూరుస్తున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు బుధవారం నాటికి పూర్తికానున్నాయి. ఇవన్నీ ఏపీఐఐసీ ఆధ్వర్యంలో జరుగుతుండగా పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు, పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ పర్యవేక్షిస్తున్నారు. అతిథుల బస, భద్రత, రవాణా సౌకర్యాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.