తాను ఎప్పుడూ ప్రజా ప్రయోజనాల కోసమే పనిచేసేవాడినే కానీ.. స్వప్రయోజనాల కోసం పనిచేసే వాడిని కాదని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు భూమన. కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు తమ రాజకీయ స్వలాభం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని.. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా తాను ఎంతకైనా పోరాడే వ్యక్తిని అని అందరికి తెలుసన్నారు. అంది నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత తనదే అన్నారు.
భూముల రిజస్ట్రేషన్‌కు సంబంధించిన నిషేధిత జాబితా (22ఏ) పై భూమన కరుణాకరరెడ్డి వివరణ ఇచ్చారు. ఐదు రోజుల క్రితం తిరుపతిలో భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి గందరగోళం ఏర్పడిందని.. ఈ విషయంలో కొందరు బాధితులు తన దగ్గరకు వచ్చి జరిగిన విషయాన్ని తెలియజేశారన్నారు. ఒక బాధ్యత ఉన్న శాసనసభ్యుడిగా బాధితుల ఉన్న సమయంలోనే.. తాను సీఎం కార్యాలయంతో, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ, ఎండోమెంట్ కమిషనర్‌తో మాట్లాడాను అన్నారు. తాను అధికారులతో మాట్లాడిన మరుక్షణమే.. వారు టీటీడీ అధికారులుకు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్‌కు తగిన ఆదేశాలు ఇచ్చారని తెలియజేశారు.
తాను టీటీడీ జేఈవో, ఎస్టేట్ ఆఫీసర్, జిల్లా రిజిస్ట్రార్‌తో సమావేశమై ఈ అంశాన్ని వెంటనే సరిదిద్దమని ఆదేశించానన్నారు. దీనికి సంబంధించి ఒక లేఖను జెఈవో ద్వారా ఎండోమెంట్ కమిషనర్‌కు రాయించినట్లు తెలిపారు. టీటీడీ కూడా జరిగిన పొరపాటును సరిదిద్దే ప్రక్రియ చేపట్టిందని.. ఈ సమస్యకు సంబంధించి పరిష్కారం వేగవంతంగా జరుగుతుందన్నారు. ఈ సమస్యను పరిష్కరించి రిజిస్ట్రేషన్‌లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తనదే అన్నారు.