వంగవీటి రాధా పార్టీ మారతాని జోరుగా ప్రచారంసాగుతున్న వేళ ఆయన యువసేన పేరిట ఓ ప్రకటన వెలువడింది. ఇదిలావుంటే వంగవీటి రాధా పార్టీ మారతారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి ఆయన టీడీపీలో ఉన్నారు.. అయితే ఎన్నికలకు మరో ఏడాది సమయం మాత్రమే ఉండటంతో పార్టీ మార్పుపై ఊహాగానాలు వినిపించాయి. రాధా జనసేన పార్టీలోకి వెళతారన్నది తాజాగా వినిపిస్తున్న మాట. సోషల్ మీడియాలో రెండు, మూడు రోజులుగా ఇదే ప్రచారం నడుస్తోంది. ఆయన మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆదివారం కూడా టీడీపీ నేత ఇంటికి పరామర్శకు వెళ్లారు.
రాధా పార్టీ మార్పుపై ఓ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వంగవీటి రాధా పార్టీ మారుతున్నారనే ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాధా యువసేన ఆ ప్రకటనలో తెలిపింది. రాధాపై దుష్ప్రచారాలు చేస్తున్నారని.. రాధా ప్రతిష్టను మసకబార్చాలని కొందరు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ఈ ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని.. రాధా టీడీపీలోనే కొనసాగుతారని పదేపదే చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
పదవుల కోసమో, ఇతర అవసరాల కోసం పార్టీలు మార్చే నైజం రాధాది కాదు అని పేర్కొన్నారు. కల్లా కపటాలు లేని స్వచ్ఛమైన రాజకీయాలు నడపటం రాధా నైజం అన్నారు రాధా యువసేన. కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులతో రాధా ప్రతిష్టను మంట కలపాలని చూసే వారి ప్రయత్నాలు ఎన్నటికీ ఫలించవన్నారు. రాధాపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని వంగవీటి అభిమానులు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
రాధా టీడీపీకి రాజీనామా చేసి జనసేనలోకి వెళతారని.. ఆయనకు విజయవాడ సెంట్రల్ సీటుపై హామీ వచ్చిందని ప్రచారం జరిగింది. మార్చి 14న.. లేని పక్షంలో మార్చి 22న ఉగాది రోజున చేరతారని ప్రచారం జరిగింది. ఇప్పుడు రాధా యువసేన పేరుతో ప్రకటన రావడంతో ఓ క్లారిటీ ఇచ్చినట్లైంది. అయితే అది రాధా యువసేన ప్రకటనా లేదా అన్నది క్లారిటీ లేదు.
వంగవీటి రాధా రాజకీయ ప్రయాణం చూస్తే.. 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. 2009లో ప్రజారాజ్యంలో చేరి విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి మల్లాది విష్ణు చేతిలో చాలా తక్కువ మెజార్టీతో ఓటమి ఎదురైంది. 2014లో వైఎస్సార్‌సీపీ నుంచి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పోటీచేయగా ఓడారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి కేవలం ప్రచారానికి పరిమితం అయ్యారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారా.. ఆయన పయనం ఎటువైపు అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.