పోలాకి మండలం ఈదులవలస-మబగాం గ్రామాల పంట పొలంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి సంభవించింది. మృతుడు రావాడ హరికృష్ణ (21) పొలంలో మృతదేహం ఉందని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ నర్సింహమూర్తి అక్కడికి చేరుకుని పరిశీలించారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హరికృష్ణ ఐటీఐ ఎలక్ట్రిషియన్ ట్రేడ్ శిక్షణ పొందుతున్నాడు. మంగళవారం సాయంత్రం పశువులను మేపేందుకు పొలానికి వెళ్లాడు. అయితే ఏమైందో తెలియదు గాని మృతుడి వద్ద విద్యుత్ వైర్లు పడి ఉండడంతో విద్యుదాఘాతంతో మృతి చెందాడా లేదా మరేవిధంగా మృతి చెందాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం యువకుడి ప్రాణాలను బలికొందని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శవానికి పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హరికృష్ణ ఒక్కడే కుమారుడు కావడం, అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు ఇలా మృత్యువాత పడడంతో తల్లి పద్మావతి, బంధువులు లబోదిబోమంటున్నారు. ఘటనా స్థలాన్ని ట్రాన్స్కో డీఈఈ ఇందిర సిబ్బందితో కలిసి పరిశీలించారు.