టీడీపీ యువ నేత లోకేశ్ తన పాదయాత్రలో భాగంగా స్పష్టత ఉన్న నియోజకవర్గాల్లో బహిరంగంగా పార్టీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తున్నారు. వారిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ఏడాది కంటే ముందే అభ్యర్థులు ఖరారైపోతున్నారు. తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల విషయంలో కొన్ని నియోజకవర్గాల్లో అయినా ఇంత స్పష్టత ఇంత ముందుగా రావడం ఇదే ప్రథమం. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేశ్ పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లోనే ఆయన అభ్యర్థులపై ప్రకటనలు చేస్తున్నారు. అభ్యర్థుల ఖరారుకు ఆయనకు అధికారిక హోదా లేకపోయినా పార్టీ వ్యవహారాల్లో ఆయన భాగస్వామ్యం అందరికీ తెలుసు కాబట్టి వాటిని అధికారిక ప్రకటనలుగానే టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. పలమనేరులో మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి, నగరిలో మాజీ మంత్రి, దివంగత ముద్దుకృష్ణమనాయుడు తనయుడు భానుప్రసాద్, సత్యవేడులో డాక్టర్ హెలెన్, చంద్రగిరిలో పులవర్తి వెంకట ముని ప్రసాద్ (నాని) పోటీ చేస్తారని ఆయన వెల్లడించారు. శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి, దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు పోటీ చేస్తారని ప్రకటించారు.