ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్శిల్ లా రూపంలో ఏపీకి పొరుగు రాష్ట్రాల మద్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2023, 11:52 PM

మెదుడుకో ఆలోచన అంటారు. మద్యం మాఫియా సరికొత్త ఆలోచన చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోకి పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని తరలించేందుకు కొత్త కొత్త మార్గాలను అన్వేషించిన వారిని ఇప్పటివరకూ మీరు చూసుంటారు. గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఇందుకోసం ఏకంగా ఆర్టీసీ కార్గో సర్వీస్, ఇండియన్ రైల్వేలనే ఎంచుకున్నాడు. అధికారులను నివ్వెరపోయేలా చేశాడు. ఆర్టీసీ కార్గో సర్వీసులను ఇలా కూడా వినియోగించుకోవచ్చా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. చెన్నై నుంచి రైల్లో అక్రమంగా తరలించిన ఆ మద్యం బాటిళ్లను రైల్వే అధికారులెవరూ గుర్తించలేకపోయారు. ఆ తర్వాత వాటిని ఆర్టీసీ బస్సులో తీసుకెళ్తుండగా.. వాటిలో ఒక బాటిల్ పగిలిపోయింది. మద్యం వాసన వస్తుండటంతో అనుమానం వచ్చి అధికారులు తనిఖీ చేయగా.. ఈ బండారం బయటపడింది.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటం, సాధారణం కంటే భిన్న రకాల బ్రాండ్లకు చెందిన లిక్కర్ అందుబాటులో ఉండటం వల్ల కొంత మంది దొంగతనంగా లిక్కర్ బాటిళ్లను తరలించేందుకు ప్రయత్నిస్తుంటారు. కార్లు, డీసీఎంలు, ట్రాలీ ఆటోల లాంటి వాటిలో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని కొంత మంది.. కాంక్రీట్ మెషిన్ వాహనాలు, అంబులెన్స్‌లలో అక్రమంగా మద్యం తరలిస్తూ మరికొంత మంది ఇప్పటివరకూ పోలీసులకు పట్టుబడ్డారు. అయితే, మద్యం అక్రమ తరలింపు కోసం ఏకంగా ఆర్టీసీ కార్గో సర్వీసునే వాడుకోవడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.


విజయవాడ నుంచి వినుకొండకు బుధవారం (మార్చి 1) తెల్లవారుజామున ఆర్టీసీ కార్గోలో చేరుకున్న రెండు బ్యాగ్‌లు, ఒక పెద్ద సూట్ కేస్‌లో మద్యం బాటిళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది మొత్తం 24 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో సిగ్నేచర్ సహా పలు రకాల బ్రాండ్ల మద్యం బాటిళ్లు ఉన్నాయి.


ప్రకాశం జిల్లా మేడపి మండలం డీవీయన్ కాలనీకి చెందిన ఓ యువకుడు ఆ బ్యాగులను తీసుకెళ్లేందుకు వచ్చాడు. అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చెన్నై నుంచి విజయవాడకు ట్రైన్‌లో, అక్కడి నుంచి వినుకొండకు బస్సులో ఆ బాటిళ్లను తరలిస్తున్నట్లు విచారణలో అతడు తెలిపాడు. ఈ తతంగం ఎన్ని రోజులుగా సాగుతుందో..?!


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com