విద్యార్థులకు ప్రతి నెలా ఇచ్చే కాస్మోటిక్ ఛార్జీలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, హాస్టళ్లు, రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల విద్యార్థులకు యూనిఫామ్ రేట్లు ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులిచ్చింది.ఇకపై ప్రతి నెలా 3వ తరగతి నుంచి 6 తరగతుల వరకు చదివే బాలురకు రూ.125, బాలికలకు రూ.130 కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వనున్నారు. 7వ తరగతి నుంచి 10 తరగతుల బాలురకు రూ. 150, బాలికలకు రూ.200, ఇంటర్మీడియట్, ఆ పై తరగతుల బాలురకు రూ. 200, బాలికలకు రూ.250 ఛార్జీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
హెయిర్ కటింగ్ ఛార్జీలు 50 రూపాయిలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, డైట్ ఛార్జీల్లో కూడా మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3, 4 తరగతులు చదివే విద్యార్థులకు రూ.1,050, 5 నుంచి 10వ తరగతులకు రూ.1,400 గా నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్, ఆ పైన తరగతుల విద్యార్థులకు రూ.1,600గా డైట్ ఛార్జీలు నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.