మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని.. ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన ముందుకు వెళ్లేలా కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు. ఈ ఆవిర్భావ దినోత్సవ సభను మచిలీపట్నంలో నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. గతంలో ఆ ప్రాంతంలో పర్యటించారని గుర్తు చేశారు. రైతులను ఆదుకోని జగన్ ప్రభుత్వం.. వారిని అనేక ఇబ్బందులు పెట్టిందన్నారు. ఆనాడు రైతులకు పవన్ అండగా నిలిచారని.. అందుకే మచిలీపట్నం ప్రజలు ముందుకు వచ్చి సభ నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు.
ఈ సభ కోసం 34ఎకరాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. సభ దృష్ట్యా భద్రత పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. మహనీయులు గురించి చాటి చెప్పేలా.. సభా ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని వివరించారు. మువ్వన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్యను గుర్తు చేసుకుంటూ.. కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పార్టీ ఆవిర్భావ వేదికకు పొట్టి శ్రీరాములు వేదికగా నామకరణం చేశామన్నారు.
సాయంత్రం జరిగే ఈ సభకు పవన్ 5 గంటలకు వస్తారని మనోహర్ వెల్లడించారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి Varahi వాహనంపై పవన్ కళ్యాణ్ బయలుదేరతారని చెప్పారు. త్వరలోనే ఈ సభకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ప్రజల కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడుతున్న పవన్‌ను ఆదరించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు. అయితే.. పవన్‌ను ఘాటుగా విమర్శించే.. పేర్ని నాని నియోజకవర్గంలో ఆవిర్భావ సభ నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.