యూపీలోని ఓ కార్యాలయంలో ఉద్యోగుల తీరు కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పట్ జిల్లా బరౌత్ పట్టణంలోని యూపీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ భవనం ఇది. అక్కడి ఉద్యోగులందరూ మీకు వింతగా కనిపిస్తారు. ఎందుకంటే, అందరూ హెల్మెట్లు ధరించి వారి పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఇదేదో నిరసనో, లేకపోతే అక్కడేదో వైరస్ వ్యాపిస్తోందనుకుంటే పొరపాటే..! అంతేకాదు.. ఈ భవనం లోపలికి సందర్శకులు వెళ్లాల్సి వచ్చినా హెల్మెట్ ధరించే వస్తున్నారు. ఇందుకు బలమైన కారణమే ఉంది.
ఈ భవనాన్ని ఎప్పుడో బ్రిటీషర్ల జమానాలో నిర్మించారు. దీంతో భవనం అంతా పాతబడిపోయింది. ముఖ్యంగా మీటర్ టెస్టింగ్ ల్యాబ్ పరిస్థితి అయితే, మరీ దారుణంగా ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఏ క్షణాన పై కప్పు పెచ్చులు ఊడి తల మీద పడతాయో అనే భయంతో ఉద్యోగులందరూ ఇలా హెల్మెట్లు ధరించి విధులు నిర్వర్తిస్తున్నారు. భవనంలో అనుక్షణం భయంభయంగా గడుపుతున్నారు.
యూపీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన ఈ బిల్డింగ్‌లో ఇంజినీర్లు, క్లర్కులు, కాంట్రాక్టు ఉద్యోగులు.. అందరూ కలిపి సుమారు 40 మంది వరకూ పనిచేస్తున్నారు. వర్షాకాలంలో అయితే మరింత ఆందోళనగా ఉందని వీరు చెప్తున్నారు. పైకప్పు పెచ్చులూడి మీద పడిన ఘటనలు బోలెడు ఉన్నాయని వీరు చెబుతున్నారు. కొంత మందికి తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయట. ఇంత జరుగుతున్నా, ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో హెల్మెట్లు పెట్టుకునే పనిచేస్తున్నారు.