‘టీడీపీ అధికారంలోకి వస్తే.. ప్రతి ఏటా జాబ్ కేలెండర్ ఇస్తాం. మేం వచ్చిన తొలి వంద రోజుల్లోనే రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తాయి. రాసిపెట్టుకోండి ఇది నా హామీ..’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువతకు మాటిచ్చారు. యువగళం పాదయాత్ర 31వ రోజైన బుధవారం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ఆయన నడక సాగించారు. మార్గమధ్యంలో ఇరంగారిపల్లి వద్ద యువతీ యువకులు, విద్యార్థులు లోకేశ్‌ను కలిశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఆయన నుంచి ఏమి ఆశిస్తున్నారని వారిని లోకేశ్ ప్రశ్నించారు. అనంతరం వారినుద్దేశించి మాట్లాడుతూ.. ఈ 31 రోజుల పాదయాత్రతో తనలో చాలా మార్పు వచ్చిందన్నారు. ప్రభుత్వం పాలసీలు రూపొందించాల్సింది నాలుగు గోడల మధ్య కాదని, ప్రజల మధ్య నుంచే వాటికి రూపకల్పన జరగాలని అభిప్రాయపడ్డారు. మహిళలను గౌరవించడమనేది కేజీ నుంచీ పీజీ వరకూ మన విద్యా విధానంలో భాగం కావాలని అభిలషించారు. టీడీపీ అధికారంలోకొస్తే కేజీ నుంచీ పీజీ దాకా ప్రత్యేక పాఠ్యాంశాలు పెడతామన్నారు. ఆ మేరకు స్టేట్ సిలబస్ ను ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే 2025 జనవరి 1న జాబ్ కేలెండర్ విడుదల చేస్తామని, తర్వాత ఏటా క్రమం తప్పకుండా జాబ్ కేలెండర్ ప్రకటిస్తామని వాగ్దానం చేశారు. పీజీ వరకూ విద్యార్థులకు ఉచిత బస్ పాసులిస్తామని, వసతి దీవెన రద్దుచేసి నేరుగా కాలేజీలకే ఫీజులు చెల్లిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా యువత, విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు లోకేశ్ సమాధానాచ్చారు.