బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఎస్సీ కమిషన్ తీవ్ర చర్యలకు ఆదేశించింది. తక్షణం వీర్రాజుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని, ఆయన్ని అరెస్టు చేయాలని కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ ఆదేశించారు. దళితుడు గొల్ల వరప్రసాద్ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వ్యవహారంలో సోము వీర్రాజుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, ఐపీసీ సెక్షన్లు 384, 386, 307లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని గుంటూరు ఎస్పీని ఆదేశించారు. మంగళగిరి మండలం చిన కాకాని వద్ద ఉన్న భూమిని గత నెల 11న దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి బెదిరించి, హత్యా ప్రయత్నం చేసిన సోము వీర్రాజుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితుడితో పాటు ప్రజాసంఘాలు కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్‌ను కోరాయి. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, సమతా సైనిక్‌దళ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాలేటి మహేశ్వరరావు, పిల్లి సురేంద్ర బాబు, ఆలిండియా రైల్వే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అసోషియేషన్ అధ్యక్షులు గూటాల పాపారావు, దళిత ప్రజాసంఘాల నాయకులు నల్లపు నీలాంబరం, పరిశపోగు రాజేష్ తదితరుల పాటు బాధితుడు గొల్ల వరప్రసాద్ కమిషన్‌కు ఈ మేరకు ఫిర్యాదు చేశారు.