కర్నూలు జిల్లా,పగిడ్యాల మండలంలోని పడమర ప్రాతకోట గ్రామంలో గురువారం దారుణం చోటుచేసుకుంది. తండ్రి ను కొడుకు ఇనుపరాడ్డుతో కొట్టి హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్ళితే..... గ్రామానికి చెందిన పల్లె వెంకటేశ్వర్లు, రమణమ్మ దంపతుల మొదటి కుమారుడు శ్రీకాంత్‌కు ఎనిమిదేళ్ల క్రితం జూపాడుబంగ్లా మండలం పారుమంచాలకు చెందిన మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీకాంత్ బైక్ మెకానిక్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కుటుంబ కలహాలతో శ్రీకాంత్ భార్య రెండేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. శ్రీకాంత్ తన భార్యను ఇంటికి తీసుకురావాలని తన తండ్రి వెంకటేశ్వర్లుతో తరచూ గొడవ పడుతుండేవాడు. కానీ తండ్రి కుమారుడి మాట వినేవాడు కాదు. దీంతో తండ్రిపై శ్రీకాంత్ కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున ఇంటి బయట నిద్రిస్తున్న వెంకటేశ్వర్లు తలపై శ్రీకాంత్ ఇనుప రాడ్‌తో కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. వెంకటేశ్వర్లు పాణ్యం డివిజన్లో లస్కర్‌గా పని చేస్తున్నాడు. వెంకటేశ్వర్లు రెండో కుమారుడు రాంబాబు ఫిర్యాదు మేరకు ముచ్చుమర్రి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్ఐ నాగార్జున తెలిపారు.