వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ వేగం పెంచింది. వారం రోజులుగా కడపలో మకాం వేసిన సీబీఐ బృందం ఎలాంటి హడావిడీ లేకుండానే పలువురు అనుమానితులకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. వివేకా హత్య జరిగిన రోజున పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ) కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు ఆయన ఇంటికి వెళ్లారని, వారందరికీ సీబీఐ నోటీసులు ఇచ్చిందని సమాచారం. వీరిలో సుధాకర్ అనే ఉద్యోగి మాత్రమే గురువారం విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య 2019 మార్చి 15న జరిగింది. ఆ రోజు వివేకా ఇంటికి వెళ్లడంతో పాటు అదేరోజు అవినాశ్‌రెడ్డితో సుధాకర్ ఫొటో దిగినట్లు సమాచారం. ఆ సమయంలో అవినాశ్‌తో ఎందుకు ఫొటో దిగాల్సి వచ్చింది.. ఎవరు చెబితే వివేకా ఇంటికి వచ్చారు.. వివేకా హత్య గురించి మీకెలా తెలిసింది..? అన్నదానిపై సీబీఐ అధికారులు సుధాకర్‌ను ప్రశ్నించినట్టు సమాచారం. కాగా, సెంట్రల్ జైలులోని అతిథిగృహంలో ఉన్న సీబీఐ అధికారులను వైఎస్ భారతి పీఏ నవీన్ లాయర్ కలిశారని సమాచారం.