ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలను రోజు రోజుకి మభ్యపెడుతూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మోసం చేస్తున్నారని సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు యువనేత డాక్టర్ కోడెల శివరాం ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని నకరికల్లు మండలం కండ్లకుంట గ్రామంలో శుక్రవారం గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు యువనేత డాక్టర్ కోడెల శివరాం హాజరయ్యారు. స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్వగ్రామమైన కండ్లకుంట గ్రామానికి తమ అభిమాన నాయకుని కుమారుడు డాక్టర్ కోడెల శివరాం రాకపట్ల గ్రామంలోని మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరై మంగళ హారతులతో సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యువనేత డాక్టర్ కోడెల శివరాం మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను రాజకీయ కక్ష సాధింపుల తో వెనక్కి పంపించేస్తూ కొత్తగా ఏదో రాష్ట్రాన్ని పరిశ్రమలతో నింపేస్తున్నామని గ్లోబల్ సమీట్ల పేరుతో ప్రజలను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నమ్మించి మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని అందుకే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ నవ్యాంధ్రప్రదేశ్ లో గాని అనేక పరిశ్రమలు, విదేశీ సంస్థలు పెట్టుబడుల రూపంలో వచ్చాయని గుర్తు చేశారు. ప్రజలంతా కూడా ఇదంతా గమనిస్తున్నారని త్వరలోనే జగన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.