సత్తెనపల్లి: స్నానపు గదుల్లో దుర్వాసన వస్తోంది. వాటికి తలుపుల్లేవు. గదుల్లోని కిటికీల అద్దాల్లేవు. ఫ్యాన్లు, దీపాలు లేవు. మీ పిల్లల్ని ఇలాంటిచోట చదివిస్తారా? మరోసారి వచ్చేసరికి వసతులన్నీ మెరుగుపర్చాలని సీనియర్ సివిల్ జడ్జి డి. నాగవెంకటలక్ష్మి ఎస్సీ విద్యార్థినుల వసతిగృహం బాధ్యురాలు రాణిని ఆదేశించారు. పట్టణంలోని వెంకటపతినగర్‌లోని ఎస్సీ విద్యార్థినుల వసతిగృహాన్ని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీచేసి, అక్కడి లోపాల్ని గుర్తించారు. పోషకాహారం, వసతులపరంగా విద్యార్థినులకు ఇబ్బందుల్లేకుండా అధికారులు చూడాలని కోరారు. ఉన్నత లక్ష్యంతో చదవాలని. క్రమశిక్షణతో మెలగాలని విద్యార్థినులకు జడ్జి సూచించారు. పారాలీగల్ వాలంటీర్ సుభాని తదితరులు పాల్గొన్నారు.