ఆస్తికోసం హాంకాంగ్ మోడల్ 28 ఏళ్ల అబ్బి చోయ్ దారుణ హత్యోదంతం యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. అబ్బి చోయ్ కనిపించడం లేదంటూ గతవారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ప్రతి ఇంటినీ జల్లెడ పట్టిన పోలీసులు రెండు రోజుల తర్వాత తై పో జిల్లాలోని ఓ ఇంటిలో ఆమె శరీర భాగాలను గుర్తించారు. అక్కడ ఉన్న ఫ్రిజ్‌లో ఆమె కాళ్లు కనిపించగా.. తల, మొండెం, చేతుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, డ్రోన్ల సాయంతో డ్రైనేజీల్లోనూ గాలించిగా.. చివరకు మానవ శరీర భాగాలున్న రెండు సూప్ కుండలను హత్య చేసిన ఇంట్లో పోలీసులు కనుగొన్నారు. అందులోని ఒక కుండలో హత్యకు గురైన మోడల్ తల కనుగొన్నట్లు హాంకాంగ్ పోలీసులు తెలిపారు.
క్యారెట్, ముల్లంగితో చేసిన సూప్ కుండ నిండుగా, చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉందని దర్యాప్తు అధికారి అలాన్ చుంగ్ అన్నారు. ఆ కుండలోని ద్రవంపైన తేలియాడుతున్న అబ్బి చోయ్ తల కనిపించిందని, దానిపై చర్మంతోపాటు, మాంసం పూర్తిగా తొలగించి చూడటానికి పుర్రెలా ఉందన్నారు. సూప్‌లో ఇతర మాంసం ముక్కలు కూడా ఉన్నాయని, వాటిని మానవ మాంసం అవశేషాలుగా గుర్తించామని అధికారి చెప్పారు. పుర్రె వెనుక భాగంలో రంధ్రం ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలో తెలిసింది.
ఈ హత్య యాదృశ్చికంగా జరగలేదని, పక్కా పథకం కొద్ది వారాల ముందు నుంచే వ్యూహరచన చేశారని పోలీసులు పేర్కొన్నారు. అపహరించి కారులో దాడికి పాల్పడి స్పృహ కోల్పోయేలా చేశారని, అనంతరం అత్యంత పాశవికంగా హత్య చేసినట్లు ఆయన మీడియాకు వివరించారు. ఫిబ్రవరి 14న చోయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహితులతో కలిసి భోజనం చేస్తోన్న ఓ ఫోటోను పోస్ట్ చేసింది.
చోయ్ శరీర భాగాలు కనుగోన్న ఇంట్లో ఎలక్ట్రిక్ రంపం, మాంసం స్లైసర్, దుస్తులు, మోడల్ ఐడీకార్డులతో సహా ఇతర వస్తువులు లభ్యమయ్యాయి. ఈ కేసులో చోయ్ మాజీ భర్త అలెక్స్ క్వాంగ్, అతడి తండ్ర క్వాంగ్ కౌ, సోదరుడు ఆంథోనీ క్వాంగ్, మాజీ అత్త జెన్నీ లీలను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య తర్వాత మాజీ అత్త సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించారు. నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరచగా వీరికి బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారు.
మోడల్ అబ్బి చోయ్ ఆస్తిని కాజేయాలనే ఉద్దేశంతోనే ఆమె మాజీ భర్త ఈ హత్యకు కుట్రపన్నినట్లు దర్యాప్తులో బయటపడింది. మాజీ భర్త కుటుంబం, అబ్బిచోయ్ మధ్య పది మిలియన్ల హాంకాంగ్ డాలర్ల విలువైన విలాసవంతమైన ఆస్తి వివాదం కొనసాగుతోంది. చోయ్ ఆర్థిక వ్యవహారాలు నిర్వహించే విధానం పట్ల కొందరు అసంతృప్తిగా ఉన్నారని పోలీసులు తెలిపారు. చోయ్‌కి నలుగురు పిల్లలు ఉండగా.. వారి వయసు 3 నుంచి 10 ఏళ్లలోపు ఉంటుంది. వీరిలో మొదటి ఇద్దరికీ అలెక్స్ క్వాంగ్ తండ్రి కాగా.. ప్రస్తుతం చోయ్ తల్లి వద్ద ఉంటున్నారు.
అబ్బి చోయ్‌ను ఆమె ఎస్టేట్ నుంచే దుండగులు అపహరించినట్టు అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. నిందితులు సెవెన్ సీటర్ కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. హత్య విషయం బయటకు పడటంతో నగరం నుంచి పడవలో పారిపోవడానికి ప్రయత్నించిన అలెక్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అతడి వద్ద భారీ మొత్తంలో హాంకాంగ్ డాలర్లు, ఖరీదైన గడియారాలు స్వాధీనం చేసుకున్నారు. చోయ్ మాజీ మామతో సంబంధం ఉన్న ఐదో అనుమానితుడిని ఆదివారం నేరస్థులకు సహాయం చేశారనే అనుమానంతో అరెస్టు చేశారు. ఈ కేసును చేధించడానికి 150 మందికిపైగా డిటెక్టివ్‌లను పోలీసులు మోహరించడం గమనార్హం.
క్వాంగ్‌తో 18 ఏళ్ల వయసులోనే 2012లో చోయ్‌కి వివాహం జరిగింది. అయితే, నాలుగేళ్లకే 2016లోనే విబేధాలతో విడిపోయారు. ప్రస్తుతం రెస్టారెంట్స్ వ్యాపారి టామ్ చుక్ క్వాన్‌తో సహజీవనం చేస్తోంది.