స్థానిక సంస్థల శాసనమండలికి స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆనెపు రామకృష్ణ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆనెపు రామకృష్ణ రాజం పట్టణంలో ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యిందని దుయ్యబట్టారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన పంచాయితీ నిధులను రాత్రికి రాత్రి దారి మళ్లించి వివిధ పథకాలకు వాడుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం వీధిలైట్లు, బోర్ల మరమ్మత్తులు చెయ్యలేని పరిస్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటు అన్నారు. వైసిపి ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో గ్రామీణ ప్రాంతాలు వెనకబడ్డాయని గ్రామీణ ప్రాంతాలలో పూర్తిగా సంక్షోభంలోకి నెట్టారన్నారు. కనీసం నిధులను కేటాయించడం లేదని ఆరోపించారు. ఎంపీటీసీలకు రూ. 15000, జడ్పిటిసి లకు రూ. 20000, సర్పంచులకు గౌరవ వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర గలాన్ని వినిపించేలా శాసనమండలికి పంపే విధముగా తమ అమూల్యమైన ఓటును వేసి అవకాశాన్ని కల్పించాలని కోరారు. ఒకే ఒక్క అవకాశం కల్పిస్తే ముందుగా రాజాం. పాలకొండ రోడ్లకు సొంత నిధులు కేటాయించి రోడ్లు మరమ్మత్తులు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, జిల్లా తూర్పు కాపు యువజన అధ్యక్షుడు టంకాల దిలీప్ కుమార్, కొయ్లాపు శ్రీనివాసరావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.