మానవ జీవితాన్ని పరిపూర్ణం చేసుకునే అవకాశం ఒక్క ఆధ్మాత్మికతతోనే లభిస్తుందని, ఈ జన్మను సక్రమంగా వినియోగించుకునేలా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ప్రచారకులు పరమపూజ్య భక్తి వికాస స్వామి అన్నారు. జలుమూరు మండలం శ్రీముఖలింగం పరిధిలోని వైదిక గ్రామమైన కూర్మ గ్రామంలో ఆదివారం శ్రవణ, కీర్తన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు తరలిరావడంతో గ్రామంలో ఆధ్యాత్మికత సంతరించుకుంది. ఈ సందర్భంగా భక్తుల నుద్దేశించి స్వామి అనుగ్రహభాషణం చేశారు. ప్రతి ఒక్క వ్యక్తి ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలన్నారు. శ్రీకృష్ణ చైతన్యంతో జీవించడం ఎలా ఎలా అని ప్రజలకు చూపించేందుకు ప్రకృతి ఒడిలో కూర్మ గ్రామాన్ని నిర్మించడం జరిగిందన్నారు. చిత్తశుద్ధితో కృష్ణభక్తిని స్వీకరించాలని, తద్వారా భక్తిభావం పెంపొందుతుందని చెప్పారు. నగరంలో కూడా కృష్ణ చైతన్యవంతులుగా ఉండొచ్చు గాని అక్కడ అనుకూలమైన వాతావరణం ఉండదని, ఆధునికత ముసుగులో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సల్యాలకు గురవుతున్నారన్నారు. వీటి నుంచి కొంత ఉపశమనం కలిగించడం ద్వారా కృష్ణ భక్తి పెంపొందించేందుకు కూర్మ గ్రామాన్ని నిర్మించడం జరిగిందన్నారు. తన పర్యవేక్షణలో కూర్మ గ్రామంతో పాటు తమిళనాడులో పంచభటి, గుజరాత్లో నంద, మధ్యప్రదేశ్లో భక్తి గ్రామం, పంజాబ్లో బదరికాశ్రమం ఉన్నాయన్నారు. కూర్మ గ్రామం కొంచెం విలక్షణమైనదని, ఇదే ఉద్దేశంతో నిర్మించిన ఇతర గ్రామాలు ఒక్కో వైవిధ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. ప్రతిఒక్కరూ కృష్ణ చైతన్యాన్ని ఆచరించడం, ప్రచారం చేయడం ద్వారా భక్తిభావం పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సుమారు 4 వేల మంది భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.