భద్రాచలం సీతారాముల కల్యాణోత్సవాలు ప్రారంభం కావడంతో భద్రగిరి పులకించింది. మార్చి 30న శ్రీరామనవమి కావడంతో కల్యాణ తలంబ్రాలను కలిపే పనులను మంగళవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భజనలు, కీర్తనలతో పరిసరాలు ఆధ్యాత్మికతతో అలరారాయి. పసుపు కొమ్ములను దంచడంతో మొదలైన క్రతువులోని ప్రతీఘట్టం పరమానందాన్ని పంచింది. కొవిడ్ వల్ల రెండేళ్లపాటు నిరాడంబరంగా ఈ వేడుక నిర్వహించగా ఈ సారి ఘనంగా చేస్తుండడంతో పలు ప్రాంతాలకు చెందిన భక్త బృందాలు విశేష సంఖ్యలో తరలివచ్చాయి. నిత్య కల్యాణ మండపం వద్ద స్నపన తిరుమంజనం నిర్వహించారు. అభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామికి డోలోత్సవం చేశారు. హరిదాసుల కీర్తనలు మంత్రముగ్ధం చేశాయి. వసంతోత్సవంతో చల్లని రామయ్య పెళ్లి కొడుకులా. చక్కని సీతమ్మ పెళ్లి కుమార్తెలా కనిపించారంటూ మురిసి పోయారు. ఆలయ సిబ్బంది, భక్తులు రంగులు చల్లుకుని ఆనంద పడ్డారు. నిత్యకల్యాణం, బంగారు కవచాల అలంకారం, సంధ్యా హారతి పూజలు ఆపారు. ఈవో నేతృత్వంలో ఏఈవోలు శ్రావణ్ కుమార్, భవానిరామకృష్ణ, డీఈ రవీంద్రనాధ్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ రామారావు, సూపరింటెండెంట్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకుడు, వేద పండితులు, అర్చకులు ఉత్సవాన్ని నిర్వహించారు.