విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం కావడంతో.. సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందించారు. విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో.. రెండు రోజుల్లో రూ. 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు.. 378 ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా 6.09 లక్షల మందికి ఉపాధి లభించనుంది. ఇటు ప్రభుత్వం కూడా ఎంవోయూలు అమలు దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించింది.
ఎంవోయూల అమలు కోసం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన.. ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddy ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ప్రతి వారం సమావేశమై.. సదస్సులో కుదిరిన ఎంవోయూల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని.. మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి.. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవెన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ డా.జి. సృజన, ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ ఎండీ ఎస్.షన్‌మోహన్ హాజరయ్యారు.