ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకునే క్రమంలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరులోని మిరాకిల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ భూములను ఆ కంపెనీ ఆక్రమించిందనే ఆరోపణల నేపథ్యంలో.. అధికారులు స్వాధీనానికి సిద్ధం అయ్యారు. స్థానిక ఆర్డీవో సూర్యకళ, తహసీల్దార్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో.. పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు సాఫ్ట్‌వేర్ కంపెనీ వద్దకు వెళ్లారు. అక్కడే సీన్ రివర్స్ అయ్యింది. సంస్థ ఉద్యోగులు, ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు.
దీంతో ముంజేరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. కంపెనీ మెయిన్ గేట్ ఎదుటకు చేరుకుని రెవెన్యూ సిబ్బంది, పోలీసులకు వ్యతిరేకంగా విద్యార్థులు, ఉద్యోగులు నినాదాలు చేశారు. కంపెనీ యాజమాన్యం, ముంజేరు గ్రామస్థులు అధికారులను అడ్డుకోవడంతో వారు వెనుదిరిగారు. గత నెలలో కూడా రెండు సార్లు రెవెన్యూ అధికారులు మిరాకిల్ సంస్థ నిర్వహణలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు.
ఇదిలావుంటే మంగళవారం మరోసారి కంపెనీ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా మిరాకిల్ కంపెనీ ఎండీ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సంస్థ పరిరక్షణలోని ప్రభుత్వ భూముల విషయంపై 2016లో హైకోర్టు స్టే విధించిందని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్‌కు ఆధారాలతో రాత పూర్వకంగా ఇచ్చామని.. అయినా.. రాజకీయ నేతల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి.. ఇలా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు.