ఫ్యాక్షన్ ప్రభావితమైన తాడిపత్రి నియోజకవర్గంలో వైస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన పాదయాత్ర శాంతికి పునాది వంటిదని, ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కరించాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన ప్రజా సంక్షేమ పాదయాత్రకు ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి సంఘీభావం తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు. బుధవారం పెద్దపప్పురు మండలం చిక్కేపల్లి గ్రామం వద్ద పాదయాత్రలో ఎమ్మెల్యే పెద్దారెడ్డిని విశ్వేశ్వరరెడ్డి కలిసి ఆయనతో పాటు నామనాంకపల్లి వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెన్నపూస రవీంద్రరెడ్డి, రామచంద్రారెడ్డిలను గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. నమూనా బ్యాలెట్ పేపర్లు విడుదల చేశారు. అనంతరం విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాల కుల మతాలకు అతీతంగా అందరు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. తాడిపత్రి నియోజకవర్గం ఈరోజు పాడి పంటలతో ఇంత పచ్చగా ఉందంటే అది నాటి వైస్సార్, నేటి సీఎం జగన్ కృషి వల్లే అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కోసం పాదయాత్రతో ముందుకు వస్తున్న పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు మరోసారి ఆదరించాలని కోరారు. అదే విదంగా మహిళలందరికి ఆయన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వంలో మహిళలకు భద్రత పెరిగిందని ఎంతో ధైర్యంగా అన్ని రంగాల్లో మగవాళ్ళతో పోటీపడి నిలబడగలుగుతున్నారని ఆయన చెప్పారు. మహిళలు మరింత అభివృద్ధి చెందాలని కాంక్షించారు. ఈ పాదయాత్రలో బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రమణ, బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు సీపీ వీరన్న తదితరులు పాల్గొన్నారు.