ఎచ్చెర్ల: మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని జిల్లా ఎస్పీ జి. ఆర్. రాధిక అన్నారు. శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఎస్ఎం పురం క్యాంపస్లో బుధవారం సాయంత్రం మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. మహిళా సాధికారితకు విద్య తొలిమెట్టుగా చెప్పారు. విద్యను నిర్లక్ష్యం చేయవద్దని, ఇంజినీరింగ్లో చేరిన విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా, అన్లైన్ క్రైం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి వ్యక్తికి జీవితంతో సమస్యలు వస్తాయన్నారు. అయితే సమస్యకు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకోవటం పరిష్కారం కాదని చెప్పారు. ప్రతి మహిళా ముబైల్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, సమస్య ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో క్యాంపస్ డైరెక్టర్ పెద్దాడ జగదీశ్వరరావు పాల్గొన్నారు.