పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ యువతను ఓటు అడిగే హక్కు వైసీపీకు లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పి. శంకరరావు అన్నారు. సిఐటియు కార్యాలయంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా యువతను వైసీపీ మోసం చేసిందన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సిపిఎస్ రద్దు చేస్తామని, పిఆర్సీ అమలు చేస్తామని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయకుండా మోసం చేశారన్నారు. హామీలు అమలు చేయకుండా మోసం చేసిన వైసీపీకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. అధికార దుర్వినియోగానికి వైసీపీ పాల్పడుతుందన్నారు. ఎన్నికల్లో వాలంటీర్లను వినియగించి మద్యం, డబ్బులు పంపేంచేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఎన్నికల్లో అడ్డగోలుగా గెలిచేందుకు బోగస్ ఓట్లను చేర్చారన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని కోరారు. పిడిఎఫ్ అభ్యర్థి రమాప్రభకు సీపీఎం, సీపీఐ మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. ప్రజలు, కార్మికులు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, యువత సమస్యలపై అవగాహన ఉన్న కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి, కార్మిక సంఘ నహకులు పాల్గొన్నారు.