అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం దేవుడు కాలనీ లో ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే.... నల్లమిల్లి పద్మ తన కుమారులు ఇద్దరితో కలిసి నివాసం ఉంటోంది. మాచవరంలో గత నెల 24న పసలపూడి మెయిన్ రోడ్డు పక్కన ఉన్న గడ్డివాములో కొవ్వూరి సత్యవేణి అనే మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉంది. అయితే సత్యవేణితో కొద్ది రోజుల క్రితం పద్మ కుమారులు ఉమామహేశ్వరరెడ్డి, సత్యనారాయణరెడ్డి అసభ్యంగా ప్రవర్తించడంతో వారిని గ్రామపెద్దలు మందలించినట్టు స్థానికులు చెప్పారు. ఇది జరిగిన తర్వాత సత్యవేణి మృతిచెందడం, పద్మ కుమారులు గ్రామంలో కనిపించకుండా పోవడంతో అనుమానాలు బలపడ్డాయి. అయితే సత్యవేణిని పద్మ కుమారులే హత్య చేసి ఉంటారని పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో దేవుడు కాలనీలో ఉంటున్న పద్మ బుధవారం సాయంత్రం ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. తన కుమారులపై గ్రామస్థులు ఆరోపణలు చేయడంతో మనస్తాపంతో పద్మ ఆత్మహత్యకు పాల్పడిందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రాయవరం ఎస్‌ఐ సురేష్ తెలిపారు.