విశాఖలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లూ వైరస్ కేసుల గురించి చర్చించారు. ఫీవర్ సర్వే ఎప్పటి నుంచి చేయాలనేది గురువారం ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో ఆస్పత్రుల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి ఆదేశించారు. వడ దెబ్బ తగలకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కొవిడ్ సమయంలో ప్రభుత్వం ఫీవర్ సర్వే చేపట్టింది. ఇప్పుడు ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో మళ్లీ సర్వే చేయాలని ఆదేశించారు. ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశ, ఏఎన్‌ఎం వారం రోజుల పాటు ఇంటింటికీ వెళ్లి ఈ సర్వే నిర్వహించనున్నారు. ఇందులో వలంటీర్లను భాగస్వామ్యం చేయనున్నారు. జ్వరంతో పాటు జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, గొంతునొప్పి వంటి లక్షణాలు ఉన్నాయా? ఎన్ని రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు? వంటి వివరాలను తెలుసుకుని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో మందులు అందుబాటులో ఉంచుకోవాలని మెడికల్ ఆఫీసర్లను ఆరోగ్య శాఖ ఆదేశించింది.