సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలకు స్వతంత్రంగా బతికే హక్కు లేదా..? అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. వెంకటాచలంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రోజుకు ఒక్క అక్రమ కేసైనా పెట్టనిదే కాకాణికి నిద్ర కూడా పట్టడం లేదని, మంత్రి పదవి వచ్చినా ఆయనకు తృప్తి లేకుండా పోయిందన్నారు. జంగాలపల్లిలో మోటారు దగ్గర నీళ్ల విషయంపై గుమ్మా రాజాగోపాల్‌కు ఆయన బంధువులతో చిన్న వివాదం జరిగిందన్నారు. ఆవివాదంలో రాజగోపాల్ చేతికి గాయమైందని, రాత్రి వరకు మధ్యస్థం చేస్తున్నామని నమ్మించి చివరకు రాజగోపాల్, రామయ్యలపై అన్యాయంగా హత్యాయత్నం కేసు బనాయించారన్నారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రాజగోపాల్‌ను సీఐ గంగాధర్, ఎస్‌ఐ అయ్యప్ప తీసుకొచ్చి గొలగమూడి రోడ్డులో అరెస్టు చేసినట్లు చూపారని, మరీ ఇంత అన్యాయమా..? అని ప్రశ్నించారు. సోషల్ వెల్ఫేర్ డీడీ రమాదేవి కాకాణి చెప్పిన మాట వినలేదని ప్రభుత్వానికి సరెండర్ చేయించి కక్షసాధింపులకు పాల్పడ్డారని, మహిళా దినోత్సవంరోజే ఒక మహిళా అధికారిని ప్రభుత్వానికి సరెండర్ చేయించి అవమానించారని సోమిరెడ్డి విమర్శించారు. అనంతరం టీడీపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా పార్టీ నాయకులు, గుమ్మా రాజగోపాల్ సతీమణితో కలిసి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్రమ కేసులు ఎలా పెడతారని పోలీసులను ఆయన ప్రశ్నించారు. తన భర్తను కావాలని హత్నాయత్నం కేసులో పోలీసులు ఇరికించారని స్టేషన్‌లో రోదిస్తున్న రాజగోపాల్ సతీమణిని టీడీపీ నేతలు సముదాయించారు.