మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో వీర మహిళ విభాగం ఆధ్వర్యంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ‘‘గతంలో మద్యం తాగి ఇంటికొచ్చిన భర్తను చూసి ఇల్లాలు హడలిపోయేది. ఇప్పుడు ఏకంగా గంజాయి కొడుతూ విచ్చలవిడిగా రోడ్లపై తిరుగతున్న మాగాళ్లను చూసి నిత్యం వణుకుతూ బతకాల్సిన పరిస్థితి నెలకొంది’’ అని అన్నారు. ‘‘తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం సమీపంలోని ఓ అంధురాలిని గంజాయి మత్తులో హత్య చేస్తే, దానిని కప్పి పుచ్చేలా ప్రభుత్వం వ్యవహరించిందే తప్ప రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తామని మాట మాత్రం చెప్పలేకపోయారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు, మహిళలు ఎంత ధైర్యంగా చదువుకొని ఉద్యోగాలు చేస్తుంటే కనీసం వారికి రక్షణ కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఉంది. మహిళలకు సమాన హక్కులు అని ఉపన్యాసం ఇవ్వడం కాదు... బలమైన శక్తిగా తయారయ్యేల జనసేన పార్టీ చిత్తశుద్ధితో పని చేస్తుంది’’ అని మనోహర్ అన్నారు.