ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అవాంతరాలను అధిగమించి ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న బాల బాలి కలకు శుక్రవారం నుంచి రాగి జావ పంపిణీ చేయాలని నిర్ణయించారు.ఈ మేరకు బుధవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన వెబెక్స్ సమావేశంలో ఆదేశాలు జారీచేశారు.ఏలూరు లో స్థానికంగా వున్న రేషన్ షాపుల నుంచి రాగిపిండి, బెల్లం పొడి ప్యాకెట్లను పాఠశాలలకు సరఫరా చేయాలని సూచించారు. ఒక్కో విద్యార్థికి 150 మి.లీ. వంతున రాగిజావను ఉదయం తరగతులు ప్రారంభమయ్యేలోగా ఇస్తారు. ప్రతీ మంగళ, గురు, శనివారాల్లో రాగిజావ పంపిణీ ఉంటుంది. మధ్యాహ్న భోజనానికి అదనంగా రాగి జావ ఇవ్వనుండగా, ఏలూరు జిల్లాలో మొత్తం 1818 పాఠశాలల్లో 1,49,395 మంది విద్యార్థులకు 1,06,913 మంది భోజన పథకాన్ని వినియోగించుకుంటున్నారు. కాగా, రాగిజావ తయారు చేసినందుకు కుక్ కం హెల్పర్లకు అదనపు గౌరవ వేతనం చెల్లిస్తారా లేదా అనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. తొలుత ఈ కార్యక్రమాన్ని ఈ నెల 2 నుంచి ప్రారంభించాలనుకున్న విషయం విధితమే.