సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు పట్టణంలో నేను పాలకొల్లు పట్టణ ఏఎస్‌ఐని అంటూ రూ.5 వేలు లేదా రూ.10 వేలు ఫోన్ పే చేయాలని, తరువాత కానిస్టేబుల్‌ను పంపి డబ్బులు తిరిగి చెల్లిస్తానని చెబుతుండడంతో పలువురికి అనుమానం వచ్చి చూడగా... ఫోన్ నంబర్ వాట్సాప్ ప్రొఫైల్ ఫొటో పోలీసులదే ఉంది. అయితే ఈ ఫొటోలు తెలంగాణ పోలీసుల ఫొటోలతో ఉన్నాయి. నిజమైన పోలీసులు అని డబ్బులు పంపితే మోసపోయినట్లేనని పలువురు వాపోతున్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా రోజుకో కొత్త అవతారం ఎత్తుతూ ప్రజలను మోసగిస్తున్నారు. సైబర్ నేరాలపై ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.