ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ తో ఆదేశాల వివాదానికి ఆస్కారం: అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్

international |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2023, 08:27 PM

అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం తాజాగా వెలువడించిన నివేదిక ఆందోళన కలిగించేదిగా మారింది. భారత్-పాకిస్థాన్, భారత్-చైనాల మధ్య క్రమంగా పెరుగుతున్న ఉద్రిక్తతలతో వివాదం ఏర్పడే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గతంలో కంటే పాక్‌ కవ్వింపు చర్యలకు సైనిక బలంతో భారత్ దీటుగా బదులిచ్చే అవకాశం ఉందని కూడా పేర్కొంది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్‌కు బుధవారం సమర్పించిన వార్షిక నివేదికలో ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ అభిప్రాయపడింది. ఈ నివేదికను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కార్యాలయం సమర్పించింది.


సరిహద్దు వివాదాల పరిష్కారం కోసం భారత్, చైనాలు ద్వైపాక్షిక చర్చల్లో నిమగ్నమైనప్పటికీ.. 2020 గల్వాన్ లోయ ఘర్షణ అనంతరం సంబంధాలు దెబ్బతిన్నాయని, ఇది దశాబ్దాలలో అత్యంత తీవ్రమైనదని నివేదిక పేర్కొంది. ‘వివాదాస్పద సరిహద్దుల్లో భారత్, చైనాలు తమ సైన్యాలను విస్తరించడం రెండు అణ్వాయుధ దేశాల మధ్య సాయుధ ఘర్షణ ప్రమాదాన్ని పెంచుతాయని, ఇది అమెరికా వ్యక్తులు, ప్రయోజనాలకు ప్రత్యక్ష ముప్పుగా పరిణమిస్తాయి.. అమెరికానికి జోక్యానికి పిలుపునిస్తాయి.. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసి) వెంబడి స్వల్పస్థాయి ఘర్షణలు వేగంగా పెరిగే అవకాశం ఉందని ఇటీవల సంఘటనలు నిరూపించాయి’ అని వ్యాఖ్యానించింది.


నివేదిక ప్రకారం.. ‘భారత్, పాకిస్థాన్ మధ్య సంక్షోభాలు రెండు అణ్వాయుధ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రత్యేక ఆందోళన కలిగిస్తున్నాయి.. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లు 2021 ప్రారంభంలో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణను పునరుద్ధరించిన తర్వాత వారి సంబంధాలలో ప్రస్తుత ప్రశాంతతను బలోపేతం చేయడానికి మొగ్గు చూపుతాయి’ అని తెలిపింది.


‘అయితే, భారత వ్యతిరేక తీవ్రవాద గ్రూపులకు మద్దతు ఇచ్చే సుదీర్ఘ చరిత్ర పాక్‌కు ఉంది.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే సైనిక శక్తితో భారత్ ప్రతిస్పందించడానికి గతంలో కంటే ఎక్కువ అవకాశం ఉంది.. కశ్మీర్‌లో హింసాత్మక అశాంతి లేదా భారత్ ఉగ్రవాద దాడి సంభావ్యతల కారణంగా తీవ్ర ఉద్రిక్తతలు సంఘర్షణ ప్రమాదాన్ని పెంచుతాయి’’ అని పేర్కొంది.


అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ ఓ ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ.. పాక్ ఉగ్రవాద నిరోధక చర్యలు, హింసాత్మక తీవ్రవాద బెదిరింపులను ఎదుర్కోవడానికి ఆ దేశంతో కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నామని చెప్పారు. ‘ప్రాంతీయ భద్రతకు కలిగే ముప్పును ఎదుర్కోవడంలో మాకు భాగస్వామ్య ఆసక్తి ఉంది.. ఉగ్రవాదం లేని సుస్థిరమైన, సురక్షితమైన దక్షిణ, మధ్య ఆసియా లక్ష్యంలో చాలా భాగం పాకిస్థాన్‌తో మా భాగస్వామ్యం బలంపై ఆధారపడి ఉంటుంది.. ఈ చర్చలు మా భాగస్వామ్య నిబద్ధతకు నిదర్శనం.. స్థిరమైన భద్రతా సంబంధాలు, ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వానికి ముప్పు కలిగించే అన్ని ఉగ్రవాద గ్రూపులను ఎదుర్కోవడానికి మనం కలిసి తీసుకోగల చర్యలపై నిజాయితీగా చర్చకు అవకాశం ఉంది’ అని ఆయన అన్నారు.


‘ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికా తన భాగస్వామ్యాన్ని విస్తరించాలని కోరుతోంది. ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వాన్ని బెదిరించే ఏదైనా సమూహం మాకు ఆందోళన కలిగిస్తుంది. ఈ ఉగ్రవాద వ్యతిరేక చర్చల సందర్భంలో మేము చర్చించిన విషయం ఇది’ అని నెడ్ ప్రైస్ చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa