శ్రీకాకుళం నగరంలో వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. సిపిఎస్ రద్దు చేసి పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, కె లోకనాథం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు శుక్రవారం డిమాండ్ చేసారు. ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులపై ప్రభుత్వ వేధింపులు మానుకోవాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, సకాలంలో జీతాలు చెల్లించాలని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన వారం రోజులలోపు సిపిఎస్ రద్దు చేస్తానని సిఎం జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయకపోగా గత సంవత్సర కాలంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు సకాలంలో చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. డిఎలు చెల్లించడం లేదని, డిఎ బకాయిల ఊసెత్తడం లేదని అన్నారు. ఆఖరికి వారి ఖాతాల్లో నిలువ ఉన్న సొమ్ము నుండి పెట్టుకునే లోన్లు కూడా సుమారు 3 వేల కోట్ల రూపాయలు గత రెండు సంవత్సరాలుగా చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. సిపిఎస్ రద్దు కోసం పోరాడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులపై తీవ్ర నిర్బంధాన్ని, అణచివేతను ఉపయోగిస్తూ అరెస్టులు, షోకాజ్ నోటీసులతో నిరంతరం బెదిరింపులకు పాల్పడడం దుర్మార్గమన్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికలలో పాల్గొన్నారని షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారని, ఎస్‌సిఆర్‌టి డైరెక్టరుగా ఉన్న ప్రతాపరెడ్డి కడప ఆర్‌జెడి సహా కొందరు ఉన్నతాధికారులు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతుంటే కట్టడి చేయలేని ప్రభుత్వం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉపాధ్యాయులను పాల్గొనకూడదని ఆదేశించడం గర్హనీయమని అన్నారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలకు పిలిచి మాట్లాడి సమస్యలను పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వం భయపెట్టి నిర్బంధాన్ని ప్రయోగించడం సరికాదని అన్నారు. పాఠశాలల పర్యవేక్షణ పేరుతో విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులను మానసికంగా వేధింపులు గురి చేస్తుంటే విద్యార్ధులకు నాణ్యమైన విద్య ఎలా వస్తుందో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన కక్ష సాధింపు ధోరణిని విడనాడి సిపిఎస్ రద్దుతో సహా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలన్నింటిని తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేసారు. ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని, ఉద్యోగ, ఉపాధ్యాయులను మానసిక వేధింపులకు గురి చేయటాన్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేసారు. ఉద్యోగ, ఉపాధ్యాయులపై ప్రభుత్వ వేధింపులు మానుకోవాలని, సకాలంలో జీతాలు చెల్లించాలని, సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శులకు సభ్యులు బి కృష్ణమూర్తి జి సింహాచలం జిల్లా కమిటీ సభ్యులు కే నాగమణి తిరుపతిరావు పి తేజేశ్వరరావు సిపిఐ నాయకులు వెంకటరమణ శ్రీనివాసరావు మరియు పార్టీ నాయకులు ఏ సత్యం ఎం ఆదినారాయణమూర్తి శ్రీదేవి పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు.