తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లో ప్రవహించేది చిత్తూరు జిల్లా రక్తం అయితే జిల్లాలో ఏ సీటు నుంచి అయినా తనపై పోటీ చేసి గెలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లా అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు తంబళ్ళపల్లెకు రావాలని ఎంపీ మిథున్ రెడ్డికి యువగళం పాదయాత్రలో లోకేష్ సవాల్ విసిరారు. దీంతో అంతే స్థాయిలో మిథున్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. ఈ నెల 12వ తేదీన తంబళ్ళపల్లెలోనే ఉంటానని, ప్లేస్ ఎక్కడో చెప్పాలని లోకేష్‌కు కౌంటర్ ఇచ్చారు.
చిత్తూరు జిల్లా డీఎన్‌ఏ లోకేష్ రక్తంలో ఉంటే.. తన మీద పోటీ చేయాలని మిథున్ రెడ్డి సవాల్ విసిరారు. లోకేష్‌తో చర్చకైనా, పోటీకైనా సిద్ధమే అని వ్యాఖ్యానించారు. ఎవరి హయాంలో చిత్తూరు జిల్లా అభివృద్ధి జరిగిందనే దానిపై చర్చకు తాను సిద్ధమే అని ప్రకటించారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం కాదని.. ఎవరో ఏదో రాసిస్తే చదవడం కాదన్నారు. తనతో చర్చకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.
ఇదిలావుంటే అన్నమయ్య జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న లోకేష్.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబపై తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాను గుప్పిట్లో పెట్టుకొని.. దోచుకోవడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. ఎంపీ మిథున్ రెడ్డి మదనపల్లెకి ఏం చేశారని నిలదీశారు. ‘‘దమ్ముంటే రా.. రేపు నేను తంబళ్లపల్లెలోనే ఉంటాను.. చిత్తూరు జిల్లా అభివృద్ధిపై చర్చ నేను రెడీ’’ అని లోకేష్ సవాల్ విసిరారు. దీంతో లోకేష్‌తో చర్చకైనా, పోటీకైనా సిద్ధమేనని మిథున్ రెడ్డి ప్రకటించారు.