ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు రితేశ్ అగర్వాల్ తండ్రి రమేశ్ అగర్వాల్ ప్రమదావశాత్తు భవనంపై నుంచి పడి మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం హరియాణాలోని గురుగ్రామ్‌లో ఎత్తైన భవనం పై నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. గురుగ్రామ్ సెక్టార్ 54లో ఉన్న డీఎల్‌ఎఫ్ క్రెస్ట్ సొసైటీలోని 20 అంతస్తు నుంచి పడిపోయినట్లు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.
'భవనంపై నుంచి పడిపోయిన వ్యక్తిని చికిత్స నిమిత్తం హుటాహుటిన పరాస్ హాస్పిటల్‌కి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఎస్‌హెచ్‌ఓతో పాటు పోలీసు బృందం వెల్లింది. ప్రమాద స్థలంలోనే వాకబు చేయగా భవనంపై నుంచి పడిపోయిన వ్యక్తి రమేశ్ పర్సాద్ అగర్వాల్‌గా తెలిసింది. ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.' అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం రమేశ్ అగర్వాల్ పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అందించినట్లు తెలిపారు పోలీసులు.
ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు రితేశ్ అగర్వాల్ వివాహం గీతాన్ష్ సూద్‌తో మార్చి 7వ తేదీన దిల్లీలోని తాజ్ ప్యాలస్‌లో జరిగింది. ఆయన వివాహ వేడుకల్లో చివరిసారిగా కనిపించారు రమేశ్ అగర్వాల్. ఈ వివాహానికి ప్రపంచంలోని టాప్ టెక్ ఎంటర్‌ప్రినర్స్‌లో ఒకడిగా రితేశ్ నిలిచిన క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన పెళ్లికి జపనీస్ బిలియనీర్, సాప్ట్ బ్యాంక్ గ్రూప్ పౌండర్ మసయోషి కుమారుడు హాజరయ్యారు.
తమకు మార్గదర్శిగా నిరంతరం స్ఫూర్తి కలింగే వ్యక్తి ఈ రోజు మరణించారని భారమైన హృదయంతో వెల్లడిస్తున్నామని రితేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. రమేశ్ అగర్వాల్ సంపూర్ణ జీవితాన్ని గడిపారని పేర్కొన్నారు. రోజూ తమతో పాటు మరెందరికో స్ఫూర్తి కలిగించేవారని గుర్తు చేసుకున్నారు రితేశ్. రమేశ్ అగర్వాల్ మరణం తమ కుటుంబానికి తీరని లోటన్నారు. తన తండ్రి రమేశ్ అగర్వాల్ చూపిన బాటలో సంక్లిష్ట సమయాన్ని అధిగమిస్తామని పేర్కొన్నారు.