జీ-20 సదస్సు ఈ నెలాఖరున విశాఖ వేదికగా జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. వివిధ దేశాల ప్రతినిధులు హాజరుకానున్న సదస్సుకు విశాఖ నగరం ముస్తాబవుతోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా నగరం రూపురేఖలు మారిపోయాయి. సరికొత్త అందాలు ఆవిషృతమవుతున్నాయి. ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ విజయవంతం కావడంతో రెట్టించిన ఉత్సాహంతో అధికారులు జీ-20 సదస్సుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా నగరంలో పర్యాటక ప్రాంతాలను విశేషంగా అభివృద్ధి చేస్తున్నారు. వివిధ దేశాల ప్రతినిధులు విశాఖ అందాలను వీక్షించనున్న నేపథ్యంలో విశాఖ ఆర్కే బీచ్, రుషికొండ, కంబాలకొండ, సీతకొండ వ్యూ, కైలాసగిరి, వుడా పార్కు వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల సుందరీకరణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పడా ప్రాంతాలు అద్భుతంగా దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా విశాఖ నగరంలో వివిధ గోడలకు అందమైన పెయింటింగ్స్ వేయడంతో సిటీకి కొత్త లుక్ వచ్చింది. వివిధ ఆకృతులకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో సిటీ రూపురేఖలు మారిపోయాయి.