మార్గదర్శి సంస్థ విజయవాడ ఎంజీ రోడ్డు బ్రాంచ్ మేనేజర్ బండారు శ్రీనివాసరావును సీఐడీ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఆయన్ను రెండో ఏసీఎంఎం కోర్టు ఎదుట హాజరుపరచగా.. న్యాయమూర్తి సునందమ్మ ఆయనకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు. దాందో ఆయన్ను విజయవాడ సబ్‌జైలుకు తరలించారు. శనివారం ఉదయం నుంచి మార్గదర్శి కార్యాలయంలో సీఐడీ, జీఎస్టీ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చేపట్టిన సోదాలు ఆదివారం ఉదయం 11 గంటల వరకు జరిగాయి. కొన్ని ఫైళ్లను, కంప్యూటర్ డిస్క్‌లను వారు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శ్రీనివాసరావును సత్యనారాయణపురంలో ఉన్న సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకెళ్లారు. సాయంత్రం వైద్య పరీక్షల అనంతరం తిరిగి సత్యనారాయణపురంలోని కార్యాలయానికి తీసుకొచ్చారు. రాత్రికి గుణదలలో న్యాయమూర్తుల నివాస సముదాయం వద్దకు తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.