రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం క్రమేణా తగ్గుతుండడం ప్రమాదకరమని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ఆహార సంక్షోభం ఏర్పడుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. 2022-23 రబీ సీజన్‌లో రాష్ట్రంలో 57.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాల్సి ఉండగా 46.2 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయని.. 10.78 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరి 17 శాతం, చిరుధాన్యాలు 7 శాతం, పప్పు దినుసులు 25 శాతం, నూనె గింజల సాగు విస్తీర్ణం 14 శాతం తగ్గిందన్నారు. వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో వ్యవసాయం, సాగునీటి రంగాలను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం చారిత్రక తప్పిదమన్నారు.