కాపులు ఎప్పటికీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ వెంటే ఉంటారని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. పవన్ కళ్యాణ్‌ను చూస్తే.. నాలకకు నరం లేదనే సామెత నిజమే అనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. కాపులు, ఎస్సీలు, బీసీలు కలిస్తే.. ఇప్పుడు అధికారం మారిపోతుందని అంటున్నారు.. ఎందుకు మారాలి.. ఎవరి చేతుల్లోకి వెళ్లాలని నాని ప్రశ్నించారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పని చేసేది వారి కోసమే కదా అని వ్యాఖ్యానించారు. వాళ్ల ప్రభుత్వాన్ని వాళ్లు ఎందుకు మార్చుకుంటారని ప్రశ్నించారు. మారాలి అంటే.. ఎవరి కోసం మారాలి.. చంద్రబాబు కోసం ప్రభుత్వం మారాలా.. అని నిలదీశారు. మీ తృప్తి కోసం.. అధికారం మారాలా.. మీరు చంద్రబాబు బాగుండాలా అని పేర్ని నాని ఫైర్ అయ్యారు.
'కాపులు, బలిజలు వేరు అని చెప్పారు. పవన్‌కు కనీసం అవగాహన లేదు. ఇన్నాళ్లు నాన్న పోలీస్ అని చెప్పారు.. ఇప్పుడు అమ్మ బలిజ అని అంటున్నారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. నాకు కులం లేదంటారు.. ప్రజారాజ్యం పార్టీ పెట్టేవరకు అసలు తన కులం ఏంటో తెలియదని అంటారు. కాసేపు రెల్లిని, కాసేపు కాపును అంటారు. ఇదేం రాజకీయం. నిజాయతీ లేని రాజకీయలు ఎందుకు. రాజకీయ నాయకుడికి కులం ఎందుకు.. జగన్ ఎప్పుడైనా చెప్పారా కులం గురించి. నాయకులకు ఆశయాలు ఉండాలి కానీ.. కులం ఎందుకు. ప్రజా నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఒక్కటైనా ఉందా' అని పేర్ని నాని ప్రశ్నించారు.
'కాపులను ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తావు. 2024 వరకు నీ మసుగు తొలుగుతుంది కదా. ఎలాగు ముసుగు తీయాలి కదా. గాజువాక, భీమవరంలో కాపులు ఎందుకు ఓటు వేయలేదని పవన్ ప్రశ్నించారు. అసలు ఒక్క కులం ఓట్లతో గెలుస్తారా. ఇలా ఆలోచిస్తే.. చట్ట సభల్లోకి ఎలా వెళ్తారు. మీ మాటల్లోనే అర్థం అవుతోంది.. జగన్‌ను కాపులు నమ్మారని. జగన్ ప్రజా నాయకుడు అని కాపులు నమ్మారు కాబట్టి ఆయన వెనక నడుస్తున్నారు. ఆ నమ్మకాన్ని జగన్ నిలబెట్టుకుంటున్నారు. కాపుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు' అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.
లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోబోనని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. 2012 నుంచి చేసింది ఏంటీ.. అసలు పార్టీ పెట్టాలని చంద్రబాబును అడిగినప్పుడు వద్దు అని చంద్రబాబు చెప్పలేదా. 2014లో ప్రశ్నిస్తాను అని చెప్పి.. ఎన్నిసార్లు ప్రశ్నించారు. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేలా చీకటి ఒప్పందం చేసుకోలేదా. ఎన్నికలకు ముందు బీజేపీని తిట్టి.. తర్వాత కలిసిపోవడాన్ని ఏమంటారు. లోపాయికారి ఒప్పందం అనరా. 2024 ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి.. మళ్లీ కాపు పాట పాడుతున్నారు. ఇంకా ఎన్నాళ్లు మాయ మాటలు చెప్పి మోసం చేస్తారు. లోపాయికారి ఒప్పందాలకు కేరాఫ్ అడ్రస్ మీరు' అని పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. 'కాపులందరినీ కట్టగట్టి చంద్రబాబుకి తాకట్టుపెట్టడమే సోషల్ ఇంజనీరింగ్ అనుకుంటున్న పవన్‌ని.. జాతి క్షమించదు' అని మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.