ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు, ప్రత్యేక వాహనాల్లో ప్రజలను తరలించి దొంగ ఓట్లు వేయిస్తున్నా యంత్రాంగం మౌనంగా ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు అపహాస్యం అవుతుంటే అధికారులు చర్యలకు దిగకపోవడం దారుణమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా పోలింగ్‌లో అక్రమాలు, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులకు పాల్పడ్డారంటూ పార్టీ నేతలు చంద్రబాబుకు వివరించారు.
టీడీపీ నేతలు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాల నేపథ్యంలో వైఎస్సార్, తిరుపతి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబునాయుడు ఫోన్‌లో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో చోటుచేసుకున్న అక్రమాలు, ఉదయం నుంచి జరిగిన ఘటనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
గ్రాడ్యుయేట్స్ ఓటు వేయాల్సిన ఈ ఎన్నికల్లో నిరక్ష్యరాస్యులు, అనర్హులతో వైసీపీ నేతలు బోగస్ ఓట్లు వేయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. దీనిపై రాజకీయ పక్షాలు చేసే ఫిర్యాదులను ఎన్నికల అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా తిరుపతిలో బోగస్ ఓట్లపై అభ్యంతరాలు తెలిపిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమన్నారు. మరోవైపు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ప్రకాశం జిల్లా ఎస్పీకి చంద్రబాబు ఫిర్యాదు చేశారు.