ఆంధ్రప్రదేశ్‌లో మూడు గ్రాడ్యుయేట్, 2 టీచర్, 4 స్థానిక సంస్థలకు ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. మొత్తం 1,538 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 10,59,420 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో ఎంత మంది ఓటు హక్కు వినియోగించుకున్నారన్నది ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంది.
మరోవైపు మొత్తం 9 స్థానిక సంస్థల అభ్యర్థులకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగా.. అందులో ఐదు చోట్ల కేవలం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. దీంతో అనంతపురం లోకల్ అథారిటీ నుంచి ఎస్.మంగమ్మ, కడప నుంచి పి.రామసుబ్బారెడ్డి, నెల్లూరు నుంచి మేరిగ మురళీధర్, తూర్పు గోదావరి నుంచి కుడుపూడి సూర్యనారాయణరావు, చిత్తూరు జిల్లా నుంచి సుబ్రమణ్యం సిపాయిల ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. దీంతో శ్రీకాకుళం లోకల్ అథారిటీ నుంచి ఇద్దరు, పశ్చిమ గోదావరిలో రెండు స్థానాలకు ఆరుగురు, కర్నూలులో ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఇక పట్టభద్రుల నియోజకవర్గాల్లో శ్రీకాకుళం- విజయనగరం - విశాఖ నుంచి 37 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు నుంచి 22 మంది, కడప - అనంతపురం - కర్నూలు నుంచి 49 మంది పోటీపడ్డారు. అలాగే, ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు టీచర్ల నియోజకవర్గంలో 8 మంది, కడప - అనంతపురం - కర్నూలు టీచర్ల నియోజకవర్గం నుంచి 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికలకు సోమవారం పోలింగ్ ముగిసిపోగా.. ఈ నెల 16వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజున ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను ప్రకటించనున్నారు.