కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిపై వేటు వేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లా.. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన వైఎస్‌ఆర్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డిని వైఎస్‌ఆర్ సీపీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా ఫిర్యాదులు రావడంతో.. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా.. చర్యలు తప్పవని హెచ్చరించింది.
కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సోదరుడు. ఈ మధ్యనే శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేసి.. పార్టీకి దూరంగా ఉంటున్నారు. తన ఫోన్‌ను ట్యాప్ చేశారని ఆరోపించారు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన తోపాటు.. సోదరుడు గిరిధర్ రెడ్డి కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే.. శ్రీధర్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయినా.. గిరిధర్ రెడ్డి కొనసాగుతారని.. ఆయనకే నెల్లూరు రూరల్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అలాంటిది అయన్ను సస్పెండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.