పంజాబ్ కు చెందిన మంత్రి త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇదిఇలావుంటే సీనీయర్ ఐపీఎస్ అధికారిణితో పంజాబ్ మంత్రికి వివాహం నిశ్చయమైంది. మంత్రి, ఆప్ ఎమ్మెల్యే హరజోత్ సింగ్ బెయిన్స్, ఐపీఎస్ అధికారిణి జ్యోతి యాదవ్‌లు త్వరలోనే వివాహం చేసుకోనున్నారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే వీరికి నిశ్చితార్ధం జరిగినట్టు తెలిపాయి. గతేడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి మొదటిసారి హరజోత్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం భగవంత్ మాన్ క్యాబినెట్‌లో విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు. త్వరలో వివాహం బంధంతో ఒక్కటై కొత్త జీవితం ప్రారంభించనున్న హరజోత్, జ్యోతి యాదవ్‌లకు పంజాబ్ స్పీకర్ శుభాకాంక్షలు తెలిపారు.
32 ఏళ్ల హరజోత్ బెయిన్స్ స్వస్థలం ఆనంద్‌పూర్ సాహిబ్‌లోని గంభీర్‌పూర్. వృతిరీత్యా న్యాయవాది అయిన ఆయన.. 2017 ఎన్నికల్లో సహ్నేవాల్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఆప్ యువజన విభాగం అధ్యక్షుడిగానూ ఉన్నారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి 2014లో ఎల్ఎల్‌బీ పూర్తిచేసిన హరజోత్.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి ఇంటర్నేషనల్ హ్యూమన్‌రైట్స్ లా సర్టిఫికెట్‌ను 2018లో పొందారు.
ఇక, పంజాబ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి జ్యోతి యాదవ్.. ప్రస్తుతం మన్సా ఎస్పీగా ఉన్నారు. హరియాణాలో గురుగ్రామ్‌కు చెందిన జ్యోతి యాదవ్.. గతేడాది ఆప్ ఎమ్మెల్యే రాజీందర్‌పాల్ కౌర్ చిన్నాతో పబ్లిక్‌గా ఘర్షణకు దిగి వార్తల్లో నిలిచారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన ఇంటిలోకి వచ్చి సోదాలు నిర్వహించారని ఎస్పీపై ఎమ్మెల్యే ఆరోపణలు చేయడం.. ఆయన సంఘ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం రావడంతోనే సోదాలు నిర్వహించామని ఎస్పీ చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది. గతేడాది జరిగిన పంజాబ్ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీఎం భగవంత్ మాన్ సహా ఆప్ ఎమ్మెల్యేలు నరీందర్ కౌర్ భరాజ్, నరీందర్‌పాల్ సింగ్ సావానా వివాహాలు చేసుకున్న విషయం తెలిసిందే.