కాలుష్య భూతం కోరల్లో థాయ్‌లాండ్ బంధీ అయింది. దీంతో అక్కడ వాతావరణ కాలుష్య అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రోజు రోజుకూ అక్కడ వాయు కాలుష్యం పెరిగిపోయి గాలిలో నాణ్యత తగ్గిపోతోంది. వాయుకాలుష్యం కారణంగా గతవారం అక్కడ దాదాపు 13 లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో రెండు లక్షల మంది ఆస్పత్రుల్లో చేరినట్లు థాయ్‌లాండ్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. వాహన కాలుష్యం, పరిశ్రమల నుంచి విడుదలచేసే కర్బన ఉద్గారాలు, పంట వ్యర్థాలు తగలబెట్టడం వల్ల వెలువడే పొగ కారణంగా రాజధాని బ్యాంకాక్ లో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. దీంతో పిల్లలు, గర్భిణీ స్త్రీలు బయటకు రావద్దని థాయ్‌లాండ్ ఆరోగ్య శాఖ హెచ్చరించింది.
‘‘గత మూడు రోజులుగా బ్యాంకాక్‌లో 50 జిల్లాల్లో పీఎం 2.5 స్థాయిలు నమోదయ్యాయి.. గాలిలో ఉండే అతి సూక్ష్మ ధూళి రేణువులు ఊపిరితిత్తుల ద్వారా రక్తంలో కలిసిపోయి శరీర అవయవాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది.. ప్రస్తుతం దేశంలో వాయు కాలుష్యం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలను దాటిపోయింది. అందుకే ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలి.. బయటకు వచ్చేప్పుడు ఎన్95 మాస్కులు ధరించాలని సూచించాం.. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా వారిని ఎక్కువ సమయం బయటకు పంపొద్దని తల్లిదండ్రులను కోరాం.. విద్యా సంస్థలు, పార్క్‌లు వంటి చోట్ల నో డస్ట్ రూమ్ పేరుతో ఎయిర్ ప్యూరిఫైర్లను ఏర్పాటు చేశాం’’ అని థాయ్ ఆరోగ్య శాఖ తెలిపింది.
అలాగే, థాయ్‌లాండ్ ఉత్తరాన ఉన్న చియాంగ్ మై నగరంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఇక్కడ ఎక్కువ శాతం మందికి ప్రధాన వృత్తి వ్యవసాయం కావడం వల్ల పంట వ్యర్థాలను తగలబెడుతుండటంతో వాయు కాలుష్యం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గాలి నాణ్యతను పెంచేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జనవరి-ఫిబ్రవరిలోనూ గాలి నాణ్యత క్షీణించినప్పుడు ఇటువంటి పరిస్థితితే ఎదురయ్యింది. వాహన ఉద్గారాలు, పంట వ్యర్థాల దహనం వంటివి పెరుగుతున్న వాయు కాలుష్యంలో భారీ పాత్ర పోషించాయి.