చాట్ జీపీటీలో సీఎం జగన్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలావుంటే చాట్ జీపీటీని ప్రపంచంలోని చాలామంది ప్రముఖులు.. కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఇది ఇచ్చే సమాచారంపై చాలామంది ఆధారపడుతున్నారు. భారత్‌లో, తెలుగు రాష్ట్రాల్లో దీని వినియోగం నెమ్మదిగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖుల గురించి దీంట్లో సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గురించి అడిగితే.. చాట్ జీపీటీ కీలక విషయాలు వెల్లడించింది.
'వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక భారతీయ రాజకీయ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. అతను గతంలో భారత పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు. గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ వంటి శాఖలను నిర్వహించారు. అమ్మ ఒడి, రైతు భరోసా వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. తల్లులు, రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అతను పాలనలో సంస్కరణలను కూడా ప్రారంభించారు. పబ్లిక్ సర్వీస్‌ల డెలివరీలో పారదర్శకత, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి అనేక సాంకేతిక ఆధారిత కార్యక్రమాలను ప్రవేశపెట్టారు' అని చాట్ జీపీటి వెల్లడించింది.
అయితే.. ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. జగన్ ఎంపీగా పనిచేశారు. కానీ.. చాట్ జీపీటీలో.. గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ వంటి శాఖలను నిర్వహించారు ఉంది. జగన్ ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రమంత్రిగా పని చేయలేదు. చాట్ జీపీటీలో మాత్రం పలు శాఖలు నిర్వహించారని ఉంది. దీంతో చాట్ జీపీటీ తప్పుడు సమాచారం ఇస్తుందనే వాదనలు బలపడ్డాయి. ఇటీవల కేసీఆర్ విషయంలోనూ చాట్ జీపీటీపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో పని చేసే అధునాతన చాట్‍బోటే ఈ చాట్ జీపీటీ. దీని పూర్తి పేరు చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైనింగ్ ట్రాన్స్‌ఫార్మర్. అధునాతన మిషన్ లెర్నింగ్ సాంకేతికతతో చాట్ జీపీటీ పని చేస్తుంది. ఈ చాట్ జీపీటీని ఏ ప్రశ్న అయినా టెక్స్ట్ రూపంలో అడగవచ్చు. ఆ ప్రశ్నకు ఈ ఏఐ టూల్ వివరమైన సమాధానాన్ని అత్యంత వేగంగా, వివరంగా ఇస్తుందనే పేరుంది. ఈ చాట్ జీపీటీలో ఎంతో అపారమైన డేటా బేస్ ఉంటుందని చెబుతున్నారు. డేటా బేస్ సాయంతో ఏ ప్రశ్నకైనా ఇది ఆన్సర్ చెప్పేస్తోంది.