ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసి ఇరువురు వ్యక్తులు లక్షల రూపాయలు వసూలు చేసిన సంఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు రేపల్లె పట్టణ సీఐ విజయచంద్ర తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో మంగళవారం రాత్రి ఆయన వివరాలను వెల్లడించారు. రేపల్లె మండలం కారుమూరు గ్రామానికి చెందిన యర్రమోతు శివ దుర్గాప్రసాద్ కు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి 2021 అక్టోబర్ 16వ తేదిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన పంజర్ల సీతారాం, గొలుసూరి వీరకుమార్లు రూ. 15లక్షలు వసూలు చేశారన్నారు. అప్పటి నుంచి వారు శివదుర్గా ప్రసాద్ ను మభ్యపెడుతూ మాటలు దాటవేశారన్నారు. చివరికి తాను మోసపోయానని గ్రహించిన శివదుర్గాప్రసాద్ పోలీసులను ఆశ్రయించాడన్నారు. విచారణలో భాగంగా నింధితులలో ఒకడైన పంజర్ల సీతారాంను మంగళవారం హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నామని, రేపల్లె కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. మరోనింధితుడు వీరకుమార్ పరారీలో ఉన్నాడన్నారు.