సామాజిక బాధ్యతలో భాగంగా విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేసినట్లు అగర్వాల్ మహాసభ విశాఖ అధ్యక్షులు విజయేంద్ర కుమార్‌గుప్తా తెలిపారు. మహారాణిపేటలోని రాజస్థాన్ సాంస్కృతిక మండలి భవనంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఉపకరణాలను పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ చేపడుతున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏడాది తొలి అంశంగా వీల్ చైర్లు, వాకర్స్, స్టిక్స్, ఊత కర్రలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రోగ్రాం చైర్మన్ ప్రకాష్ సరోగి మాట్లాడుతూ భవిష్యత్తులో శాశ్వత ప్రాతిపదికన ఇటువంటి కార్యక్రమాలను చేపట్టాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కో-చైర్మన్ అగర్వాల్ మాట్లాడుతూ, మూడు దశాబ్దాలుగా తమ సంస్థ విశాఖ నగరంలో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టిందన్నారు. అదే స్ఫూర్తితో రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు, హైదరాబాద్ వంటి సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులకు ఉపకరణాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. 98 సంవత్సరాల మహిళ, నాలుగేళ్ల బాలిక లబ్థిదారులలో ఉన్నారని పేర్కొన్నారు. 290 మందికి వీల్ చైర్లు, వాకర్, వాకింగ్ స్టిక్స్, ఊత కర్రలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ పవన్ కుమార్ కన్నా రియా, సంజరు కానొడియ, రాజేష్ అగర్వాల్, సంజరు అగర్వాల్, మహాసభ కార్యదర్శి దేవకి నందన్ అమన్ గార్గ్, విష్ణు పచేరియ, ఎన్‌ఎన్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.